గుర్తింపు సంఘాల ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ వెల్లడి

గుర్తింపు సంఘాల ఎన్నికల తర్వాతే ఆర్టీసీ విలీనం : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ వెల్లడి
  • కౌన్సిల్‌‌‌‌లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి  సమాధానం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గుర్తింపు సంఘాల ఎన్నికల అనంతరం టీఎస్‌‌‌‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను కొనసాగిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ తెలిపారు. భవిష్యత్‌‌‌‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఈ ప్రక్రియలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాలను భాగస్వామ్యం చేస్తామని స్పష్టం చేశారు.

సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్‌‌‌‌ మల్లన్న అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఆర్టీసీ విలీనం కోసం గత ప్రభుత్వం అధికారుల కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, అది కార్యాచరణలోకి రాలేదని మంత్రి తెలిపారు. కాంగ్రెస్​ ప్రభుత్వం గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని, ఎన్నికల్లో గెలిచిన సంఘాల ప్రతినిధులను కూడా అధికారుల కమిటీలో భాగస్వామ్యం చేసి విలీన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఆర్టీసీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేలకు పైగా బస్సులు నడుస్తున్నాయని, ఆర్టీసీని దేశంలోనే రెండో స్థానానికి తీసుకెళ్లేలా పటిష్ట చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా ఇప్పటివరకు సుమారు 35 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి, రూ.12,260 కోట్ల మేర లబ్ధి పొందారని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీలో కొత్తగా 2,932 బస్సులను కొనుగోలు చేశామని, ప్రస్తుతం 1,024 ఎలక్ట్రిక్‌‌‌‌ బస్సులు సేవలునందిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే హైదరాబాద్‌‌‌‌ సిటీలో త్వరలో మరో 2,200 ఎలక్ట్రిక్‌‌‌‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. 

4,538 ఉద్యోగాల భర్తీ

ఆర్టీసీలో మొత్తం 4,538 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశామని మంత్రి పొన్నం చెప్పారు. ఇప్పటికే 1,000 డ్రైవర్‌‌‌‌, 743 శ్రామిక పోస్టుల నియామకాలు పూర్తయ్యాయని, మరో 1,500 కండక్టర్‌‌‌‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.  మానవతా దృక్పథంతో 1,424 కారుణ్య నియామకాలు చేపట్టామని, గతంలో సర్వీసు నుంచి తొలగించిన 244 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకున్నామని వెల్లడించారు. కార్మికులకు వర్తించే ప్రమాద బీమా రూ.కోటికి పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. భవిష్యత్‌‌‌‌లో మెట్రో, ఆర్టీసీ సేవలను అనుసంధానిస్తూ సింగిల్ టికెట్ సిస్టమ్‌‌‌‌ తీసుకువచ్చే దిశగా చర్యలు  కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.